Rahul Gandhi : భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ (Congress } అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi} మరోసారి అన్నారు. చైనా మన భూమిని లాక్కుందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారని, కానీ ఒక్క అంగుళం కూడా పోలేదని ప్రధాని మోడీ (Modi) అంటున్నారని ఆయన ఆరోపించారు. . ఆదివారం లడఖ్ పర్యటనలో ఉన్న రాహుల్.. ఇక్కడి ప్రజలతో మాట్లాడారు. తమకు కల్పించిన స్టేటస్ పట్ల వీరు అసంతృప్తితో ఉన్నారని, వీరి వద్ద పలు ఫిర్యాదులు ఉన్నాయని ఆయన తెలిపారు.’ చైనా ఆర్మీ మేము మేకలు, గొర్రెలను మేపుకుంటున్న ప్రాంతం లోకి ప్రవేశించి ఆ భూమిని స్వాధీనం చేసుకుంది అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.. కానీ మోడీ మాత్రం ఒక్క ఇంచ్ కూడా పోలేదని అంటున్నారు.. ఇది నిజం కాదు. ఇక్కడ మీరు ఎవరినైనా అడగండి’ అని ఆయన ప్రధానిని ఉద్దేశించి పేర్కొన్నారు.
గత మూడేళ్ళుగా భారత-చైనా మధ్య బోర్డర్ కు సంబంధించి ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. 2020 జూన్ లో తూర్పు లడఖ్ లోని గాల్వన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినప్పటి నుంచి ఇది మరింత తీవ్రమైంది. కాగా ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉందని, కేంద్ర పాలిత ప్రాంతంగా దీన్ని ప్రకటించినప్పటికీ ఇక్కడివారికి సరైన ప్రయోజనాలు లభించడం లేదని రాహుల్ అన్నారు . మాకు ప్రాతినిధ్యం కల్పించండి .. బ్యూరోక్రసీ పాలనను మేం కోరుకోవడం లేదు అని వీరు చెబుతున్నారని ఆయన వెల్లడించారు. ప్రజావాణి తోనే ఈ ప్రాంతం కొనసాగాలన్నారు.
నిన్న రాహుల్ ఇక్కడి పాంగాంగ్ సరస్సు వద్ద బైక్ నడిపి అందరి దృష్టిని ఆకర్షించారు.
పైగా తన తండ్రి.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని పాంగాంగ్ సో తీరాన ఆయనకు నివాళులర్పించారు. లడఖ్ లో తాను బైక్ నడుపుతున్న ఫోటోలు పదింటిని ఆయన తన ఇన్స్ టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
హిందీ-చీనీ భాయీ భాయీ మాటేమిటి ?
లడఖ్ లోని భారత భూభాగాన్ని చైనా లాగేసుకుందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని.. మరి ‘హిందీ-చీనీ భాయి భాయి ‘ అని మొదట ఎవరు నినాదం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎత్తిపొడిచారు. అలాగే మన భూభాగం లోని 45 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆ దేశానికి ధారాదత్తం చేశారన్నారు. మరో మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా రాహుల్ పై ధ్వజమెత్తారు. రాహుల్ ఎక్కడికి వెళ్లినా దేశ వ్యతిరేక ప్రచారాలు చేస్తుంటారన్నారు.