ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ (Jagdeep Dhankhar) ను అనుసరిస్తూ టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ ( Kalyan Banerjee) చేసిన మిమిక్రిపై దుమారం రేగుతోంది. ఈ ఘటనపై ఎన్డీఏ ఎంపీలు ఫైర్ అవుతున్నారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) కూడా ఈ ఘటనను ఖండించారు.
ఎంపీ వ్యవహరించిన తీరుపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ నుంచి 150 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని అన్నారు. కనీసం దానికి గురించి ఒక వార్తయినా రాశారా చూపించండంటూ మీడియాను ఆయన ప్రశ్నించారు.
సస్పెన్షన్ తర్వాత ఎంపీలంతా అక్కడ కూర్చున్నారని అన్నారు. దాన్ని తాను వీడియో తీశానన్నారు. అది తన ఫోన్లోనే ఉందన్నారు. మీడియా దాన్ని చూపిస్తోందని అన్నారు. తమ ఎంపీలను 150 మందిని సభ నుంచి బయటకు విసిరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దానిపై మీడియాలో చర్చే లేదన్నారు.
అదానీపై చర్చ లేదు, రాఫెల్‌పై చర్చ లేదు, నిరుద్యోగితపై చర్చ లేదని మండిపడ్డారు. తమ ఎంపీలు తీవ్ర మనస్తాపం చెంది పార్లమెంట్ బయట కూర్చున్నారని చెప్పారు. కానీ దీనిపై ఏదైనా వార్త ఉందేమో చూపించండన్నారు. ఇది మీ బాధ్యత. కానీ మీరు కేవలం మిమిక్రీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారంటూ మీడియాను ప్రశ్నించారు.