Rahul Gandhi : గిరిజనులను వనవాసీలని వ్యవహరిస్తూ బీజేపీ (BJP) వారిని అవమానిస్తున్నదని కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) ఆరోపించారు. వారు వనవాసీలు కారని, ఆదివాసీలని అన్నారు. వనవాసీలని పిలవడం ద్వారా వారిని అడవులకే పరిమితం చేశారన్నారు. వారి భూమిని లాక్కుని పారిశ్రామికవేత్తలకు ఆ పార్టీ అప్పగిస్తోందన్నారు. ఆదివారం కేరళ వయనాడ్ (Wayanad) జిల్లాలోని మనంతవాడి ప్రాంతంలో డా. అంబేద్కర్ డిస్ట్రిక్ట్ క్యాన్సర్ సెంటర్ వద్ద హెచ్ టీ కనెక్షన్ ని ఆయన ప్రారంభించారు.
వనవాసీలని వ్యవహరించడం వెనుక దురుద్దేశంతో కూడిన ‘లాజిక్’ ఉందని, భూమికి సొంతదారులైన వారిని అడవులకే పరిమితం చేసి వారి హక్కులను కాలరాస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. గిరిజనులు అడవులను వదిలిరాదన్నదే బీజేపీ నేతల ఐడియా.. అసలు వనవాసీ అన్న పదాన్నే మా పార్టీ సమర్థించదు . ఇది చరిత్రను, గిరిజన వర్గాల సంప్రదాయాలను వక్రీకరించడమే అని రాహుల్ విమర్శించారు.
దేశంతో వీరికి గల సంబంధాలపై దాడి చేయడమే బీజేపీ ఉద్దేశమన్నారు. గిరిజనులకు తమ అటవీ భూములపై హక్కు కల్పించాలని, విద్య, ఉద్యోగాలు వంటి వాటిలో వారికి అవకాశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ ప్రాంతంలో క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్దికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 50 లక్షలు ఇస్తున్నట్టు రాహుల్ ప్రకటించారు. ఇక్కడ ఛాతీ సంబంధ క్యాన్సర్ తో ఎంతో మంది మహిళలు బాధపడుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.