Rahul Gandhi : రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. 26 విపక్షాలతో కూడిన ‘ఇండియా’ కూటమి గురించి ప్రస్తావిస్తూ ఆయన.. చర్చలు, సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఇండియా కూటమి ఏర్పడవలసిన పరిస్థితి ఈ సమయంలో ఎంతైనా ఉందని, ప్రతి ఎన్నిక సందర్భంలోను స్థానిక సమస్యలు కీలక పాత్ర వహించినప్పటికీ దేశం లోని ప్రస్తుత పరిస్థితి మాత్రం అన్ని పార్టీల పైనా ఎంతో ఒత్తిడిని పెంచిందని అన్నారు.
ఇది ప్రజల నుంచి వచ్చిందని, అందువల్లే అన్ని విపక్షాలూ కలిసి ఓ కూటమిగా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ప్రధాని మోడీ అహంకారిగా వ్యవహరించరాదని, 2014 నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ పార్టీకి 31 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. మిగతా 69 శాతం ఓట్లు మోడీకి వ్యతిరేకంగా పడినవేనని గెహ్లాట్ వ్యాఖ్యానించారు.
‘ఇండియా’ కూటమి గతనెలలో బెంగళూరు లో సమావేశమైనప్పుడు ఎన్డీయే భయపడిపోయిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే 50 శాతం ఓట్లతో అధికారం లోకి వస్తుందా అన్న ప్రశ్నకు ఆయన.. మోడీ ఆ విజయాన్ని సాధించలేరన్నారు. తన పాపులారిటీ హెచ్చు స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆయన 50 శాతం ఓట్లను సంపాదించలేకపోయారని, ఆయన ఓట్ల షేర్ తగ్గుతూ వస్తోందని, ఎవరు ప్రధాని అవుతారో 2024 ఎన్నికలే నిర్ధారిస్థాయని గెహ్లాట్ చెప్పారు.
కాంగ్రెస్ కారణంగానే మోడీ 2014 లో ప్రధాని కాగలిగారన్నారు. మోడీ వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన తప్పు పట్టారు. చంద్రయాన్-3 విజయానికి కారణం నాడు దివంగత ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ , ఇందిరా గాంధీ చేసిన కృషే నని అశోక్ గెహ్లాట్ చెప్పారు.