అర్జున, ఖేల్ రత్న అవార్డులను వాపస్ చేయాలని రెజ్లర్ (wrestler) వినేష్ పోగట్ (vinesh Phogat) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మోడీ సర్కార్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఈ దేశంలోని ప్రతి కూతురు ఆత్మగౌరవానికే తన మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
ఆ తర్వాతే ఏ పతకాలకైనా, గౌరవాలు, సన్మానాలకైనా ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ప్రకటిత బాహుబలికి రాజకీయ ప్రయోజనాలు అనేవి ఈ వీర కుమార్తెల కన్నీళ్ల కన్నా ఎక్కువ అయ్యాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి జాతికి సంరక్షకుడని తెలిపారు. కానీ ప్రధానిలో ఇలాంటి క్రూరత్వం చూస్తుంటే అత్యంత బాధగా ఉందని ట్వీట్ చేశారు.
మహిళా రెజ్లర్లకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా తన అర్జున, ఖేల్ రత్న అవార్డులను వాపస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు వినేశ్ పోగట్ వెల్లడించారు. తన అవార్డులను వాపస్ ఇచ్చేందుకు ప్రధాని మోడీ నివాసానికి వినేశ్ పోగట్ బయలు దేరారు. ఆమెను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కర్తవ్య పథ్‌లో ఫుట్ పాత్ పై తన అవార్డులను వదిలి వినేశ్ పోగట్ వెళ్లిపోయారు.
అంతకు ముందు ప్రధాని మోడీకి వినేశ్ పోగట్ లేఖ రాశారు. మహిళ రెజ్లరకు న్యాయ జరగడం లేదని, అందుకు నిరసనగా తన అవార్డులను తిరిగి ఇచ్చి వేస్తున్నట్టు చెప్పారు. ఇటీవల రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత భజరంగ్ పునియా, వీరేంద్ర సింగ్ యాదవ్ లు కూడా తమ పద్మశ్రీ అవార్డులను తిరిగి ఇచ్చి వేశారు.