కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మంగళ వారం ఉదయం యాత్రను తాత్కాలికంగా నిలిపి వేయనున్నట్టు కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ వెల్లడించారు.
పరువు నష్టం కేసుకు సంబంధించి సుల్తాన్‌పూర్‌లోని జిల్లా సివిల్ కోర్టులో రాహుల్ గాంధీ హాజరు కావాల్సి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్టు చెప్పారు. 4 ఆగస్టు 2018న బీజేపీ నేత దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి రాహుల్ గాంధీకి సమన్లు వచ్చాయని చెప్పారు.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ మంగళవారం సుల్తాన్ పూర్ జిల్లా సివిల్ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉందని వివరించారు. దీంతో యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అమేథీలోని ఫుర్సత్‌గంజ్ నుండి భారత్ జోడో న్యాయ్ యాత్రను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
2018లో బెంగళూరులో నిర్వహించిన ఓ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది.