Rahul Gandhi: మణిపూర్ (Manipur) మండిపోతుంటే ప్రధాని మోడీ (Modi) నిన్న పార్లమెంటులో ఈ సమస్యపై హాస్యాస్పదంగా మాట్లాడారని, మణిపూర్ ఇష్యూను తమాషాగా మార్చారని కాంగ్రెస్ (Congress) అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. కొన్ని నెలలుగా హింసతో మండుతున్న మణిపూర్ లో, ప్రజలు హత్యలకు గురవుతున్నారని, అత్యాచారాలు జరుగుతున్నాయని..కానీ మోడీ సభలో నవ్వుతూ, జోకులు వేస్తూ మాట్లాడారని ఆయన మండిపడ్డారు.
లోక్ సభలో మోడీ రెండు గంటల 13 నిముషాలు ప్రసంగించారని, కానీ చివరలో ఆ రాష్ట్ర పరిస్థితిపై 2 నిముషాలు మాత్రమే మాట్లాడారని రాహుల్ అన్నారు. ఇది ఆయనకు తగదన్నారు. మణిపూర్ లో పరిస్థితిని సైన్యం రెండు రోజుల్లో చక్కదిద్దగలదని, కానీ మంటలకు ఆజ్యం పోయాలనే ప్రధాని కోరుకుంటున్నారని, మంటలు ఆర్పే ఉద్దేశం ఆయనకు లేదన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రాహుల్.. దేశంలో జరుగుతున్న హింసపై ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు. భారత్ ను హత్య చేశారని తాను అనలేదని, మణిపూర్ ను హత్య చేశారు.. దాన్ని రెండుగా చీల్చారని మాత్రమే అన్నానని ఆయన సమర్థించుకున్నారు. తన మాటల్లోని ‘భారత్ మాత’ అన్న పదాన్ని సభా రికార్డుల నుంచి ఎందుకు తొలగించవలసి వచ్చిందన్నారు.
ఇంత జరిగినా మణిపూర్ ని మోడీ ఇంతవరకు ఎందుకు సందర్శించలేదని కూడా రాహుల్ ప్రశ్నించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు తొలగించలేదన్నారు. అక్కడి పరిస్థితిని చూసి కేంద్ర దళాలే ఆశ్చర్య పోయాయని ఆయన చెప్పారు.
19 ఏళ్ళ అనుభవంలో మణిపూర్ లో నేను ఏం చూశానో, ఏం విన్నానో ఎప్పుడూ చూడడం గానీ , వినడం గానీ జరగలేదన్నారు. ‘నేను మెయితీలు ఉన్న ప్రాంతాన్ని విజిట్ చేసినప్పుడు.. మా సెక్యూరిటీలో కుకీలు ఎవరూ ఉండకూడదని వారన్నారు. . అలాగే కుకీలు ఉన్న చోటుకు వెళ్ళినప్పుడు నా వెంట మెయితీలు ఎవరూ ఉండరాదని, ఎవరైనా ఉంటే కాల్చి పారేస్తామని హెచ్చరించారు. అందువల్లే అక్కడ రెండు రాష్ట్రాలు ఉన్నాయని నేను వ్యాఖ్యానించాను’ అని రాహుల్ పేర్కొన్నారు.