మరి కొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు (Election Results) విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ (Exit Polls), ఎన్నికల ఫలితాల గురించి చర్చించుకుంటున్నారు. తాజాగా ఫలితాల గురించి అంచనాలు వేసేందుకు కొంగ్రెస్ అధిష్టానం తమ పార్టీ సభ్యులతో సమావేశమైంది.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఫలితాల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ఆయన కీలక సూచనలు చేసినట్టు సమాచారం. కౌంటింగ్ కేంద్రాలు దాటి కాంగ్రెస్ అభ్యర్థులు బయటకు రావొద్దని ఆయన సూచించారు. అటు ఏఐసీసీ పరిశీలకులు కూడా తమకు కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని ఆదేశించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మరోవైపు ఈ రోజు సాయంత్రం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి జార్జ్ లు హైదరాబాద్ చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వచ్చారని డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తమ పార్టీ అభ్యర్థులు తమ దృష్టికి తీసుకు వచ్చారని
తెలిపారు.
తమ పార్టీ అభ్యర్థులు ఈసారి ఎలాంటి ప్రలోభాలకు లొంగేందుకు సిద్దంగా లేరని ఆయన స్పష్టం చేశారు. వారంతా ఇప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారని వివరించారు. క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉండబోదని తేల్చి చెప్పారు. తెలంగాణలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.