వందే భారత్ రైళ్ల (Vande Bharat Trains)కు సంబంధించి రైల్వే శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. త్వరలో వందే భారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌ల (Sleeper Coach)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్ నాటికి ఈ సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు వస్తామని పేర్కొంది.
ఈ రైళ్లలో 16 నుంచి 20 వరకు కోచ్ లు ఉంటాయని, వీటిని అందుబాటులోకి తీసుకు రావడం వల్ల ప్రధాన నగరాల మధ్య దూరంగా చాలా వరకు తగ్గుతుందన్నారు. ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లు ఉదయం మాత్రమే సేవలు అందిస్తున్నాయి. కానీ రాత్రి సమయాల్లో అత్యధిక దూరం ప్రయాణించే రూట్లలో ఈ నూతన వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ లను నడపాలని నిర్ణయించినట్టు అధికారులు చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీ-ముంబై మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఢిల్లీ-హౌరా మధ్య మరో రైలును నడపనున్నట్టు పేర్కొన్నారు. భారతీయ రైల్వేలో ఇప్పటివరకు ఉన్న సర్వీసుల కంటే ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ లు వేగంగా ప్రయాణించనున్నాయి. దీని వల్ల రెండు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం 40,000 సాధారణ కోచ్‌లను అధునాతన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తరహా కోచ్‌లుగా మారుస్తామని ప్రకటించారు. ఇది ఇలా వుంటే వందే భారత్ మెట్రో సేవలను తీసుకు వచ్చే అంశంపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని అధకిారులు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లను నడపాలని అధికారులు ఆలోచిస్తున్నారు. సికింద్రాబాద్ – పూణే మార్గంలో ఒక సర్వీస్, విశాఖ-భువనేశ్వర్ మధ్య రెండో సర్వీస్ తీసుకు రావాలని అధికారులు యోచిస్తున్నారు.