నాలుగు రోజుల నుంచి తెలంగాణ(Telangana)లో అక్కడక్కడ చెదురుమొదురు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ అంతా మేఘాలు కమ్ముకున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురువగా మరికొన్ని చోట్ల జల్లులు కురిశాయి. తాజాగా మరోసారి భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలో నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించారు. ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సిరిసిల్ల, జనగాం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందన్నారు. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
అదేవిధంగా భారత్‌లోని పలు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలోని అల్పపీడన కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 29వ తేదీ బుధవారం నాడు అల్పపీడనం పడమర దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో డిసెంబర్ 1వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.