ఏపీ (AP) ప్రజలకు వాతావరణ శాఖ (Department of Meteorology) కీలక సూచన చేసింది. ఆయా జిల్లాలో రానున్న రెండు రోజుల్లో పిడుగలతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అంతర్గత కర్ణాటక (Karnataka) నుంచి పశ్చిమ విదర్భ (Vidarbha) పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని పేర్కొంది. అందువల్ల పలు చోట్ల వర్షాలు పడనున్నాయని వెల్లడించింది.
అదేవిధంగా జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి బలహీన పడిందని వాతావరణ శాఖ పేర్కొన్నారు. ఈ ప్రభావంతో నేడు, రేపు ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడలో వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు అంబేడ్కర్ కోన సీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడనున్నాయని తెలిపారు. అయితే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.