కారుమేఘం కుమ్మరించే చినుకుతో పులకించాలని పుడమి సైతం ఎదురుచూస్తుంది. మొలకెత్తిన విత్తనం ఆకాశం వైపు తలఎత్తి చూసింది.. తనకు ఊపిరులూదే చినుకమ్మ రుణం ఎలా తీర్చుకోవాలో అని ఆలోచిస్తూ.. ఏకధాటిగా కురిసే జడివానకు కొండ ,కోన, పైరు కొత్త చీర కట్టుకున్న పడుచులా ముస్తాబు అవ్వాలని ఆశపడుతున్నాయి. ప్రకృతి వానచినుకు కోసం తపించగా.. మనుషులం మనం ఎంత.. ఎందుకంటే ఒక్క చినుకు విలువ ప్రకృతికి తెలిసినంత మనుషులకి తెలియదు కాబట్టి.. మానవుడు ఎప్పుడు అల్పుడే అంటారు పెద్దలు..
ఇక నీటి బొట్టు కోసం అలమటిస్తున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh).. ఇక్కడ అతివృష్టి.. లేదా అనావృష్టి.. వీటి వల్ల ప్రజలు, రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కోవడం తెలిసిందే.. ఇలాంటి పరిస్థితిలో చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ (Meteorology Department) అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు (rains) పడతాయని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు (Chittoor)జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు వర్షాల కోసం ప్రకాశం జిల్లా దోర్నాల, చిన్న గుడిపాడులో గ్రామస్థులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, వర్షాలు కురిపించాలని పూజలు నిర్వహించారు.
మరోవైపు ఈ ఏడాది సరిపడా వర్షాలు కురవక పోవడంతో పలు జిల్లాలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.. మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.