భగ్గుమంటున్న ఎండలతో తెలంగాణ(Telangana) ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మార్చి నుంచే ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. ఏప్రిల్ ప్రారంభం నుంచి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 43డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు.
తెలంగాణలో నేటి(శనివారం) నుంచి అక్కడక్కడ వర్షాలు(Rain) కురుస్తాయని తెలిపారు. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో మూడు రోజులుగా వర్షాలు కురిసినప్పటికీ హైదరాబాద్లో మాత్రం వర్షాలు కురిసే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో శనివారం వడగళ్ల వాన కురుస్తుంది. నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూల్, వనపర్తి, సూర్యాపేట, మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో ఆదివారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.
ఈనెల 7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశముంది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలలో సోమవారం వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు.