నక్సల్స్(Naxals)కు కంచుకోటగా ఉన్న అబూజ్మడ్(Abuzmud)లో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 1.30 సమయంలో పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. సాయంత్రం 5.30 వరకు.. సుమారు 4 గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. మృతుల్లో తెలంగాణకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, దాసర్వర్ సుమన అలియాస్ రజిత ఉన్నారు.
ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్(Chhattisgarh Cm Vishnu Deo Sai) స్పందించారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు డీఆర్జీ, బీఎస్ఎఫ్ సిబ్బందిని విష్ణు దేవ్ సాయి ప్రశంసించారు. ఇది తమ ప్రభుత్వ అతిపెద్ద విజయమని ఆయన అభివర్ణించారు. బస్తర్‌లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయని, ఈ ప్రక్రియను అడ్డుకోవాలని నక్సల్స్ భావించినట్లు తెలుస్తోందని సీఎం తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం బస్తర్, కంకేర్ లోక్‌సభ నియోజకవర్గాలకు సమీపంలో ఉన్నదని తెలిపారు.
గతంలో ప్రభుత్వం ‘నియాద్ నెల్లనార్’ పథకం ద్వారా నక్సలిజాన్ని తుదముట్టించాలని భావించినట్లు గుర్తుచేశారు. మిగిలిన వారు జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుకుంటున్నట్లు సీఎం విష్ణుదేవ్ తెలిపారు. ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఆసుపత్రికి తరలించామని సీఎం తెలిపారు.
కేంద్ర మంత్రి అమిత్ షా మంగళవారం మాట్లాడుతూ.. నిర్వహించిన ఆపరేషన్‌కు సంబంధించి భద్రతా బలగాలను అభినందించారు. నక్సల్స్ సమస్య నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంగళవారం నాటి ఘటనతో కలిపి.. ఈ మూడున్నర నెలల్లో మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు మృతిచెందారు.