ప్రధాని మోడీ (PM Modi) తెలంగాణ (Telangana) పర్యటన నేపథ్యంలో ఎందుకొస్తున్నారని బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రశ్నించారు. మహబూబ్ నగర్ (Mahabub Nagar) కు ఏం చేశారని నిలదీశారు. ఈ నేపథ్యంలో బీజేపీ (BJP) నేతలు కూడా దీటుగా బదులిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కేసీఆర్ (KCR) పథకాలన్నీ పూర్తిగా వైఫల్యం చెందాయని.. విద్య, వైద్యం పూర్తిగా కుంటుపడిందని.. ఆర్థిక వ్యవస్థ విఫలం అయ్యిందని విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) కూడా స్పందించారు.
బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనన్న రాజాసింగ్.. కుట్ర పూరితకంగా తెలంగాణపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీకి ముఖం చూపించుకోలేక అనవసర విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు. అంతేకాకుండా, మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేసి ప్రజల్లో అభాసుపాలు కాకండి అంటూ హితబోధ చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ లు వెన్నుపోటు పార్టీలని వ్యాఖ్యానించారు.
దమ్ముంటే మోడీని కలిసి రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్, కేటీఆర్ చర్చించాలన్నారు. ప్రధానిని కలసి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను అడగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ప్రధానిని కలిసి ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు.
ఇక, మోడీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే అంశంపై ఈ పోస్టర్లలో నిలదీశారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు, కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారని.. తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.తెలంగాణ మీద మోడీది సవతి తల్లి ప్రేమ అంటూ విమర్శించారు. మోడీకి మహబూబ్ నగర్ లో, తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదని పోస్టర్లలో పేర్కొన్నారు.