మంత్రి కేటీఆర్ (KTR) కు బీజేపీ (BJP) నేతలు, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రజల్ని పీడించిన నిజాం నిరంకుశత్వాన్ని చూపిస్తూ తెరకెక్కిన రజాకార్ (Razakar) సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) దీనిపై స్పందిస్తూ కేటీఆర్ కు స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. మీరు, మేము కలిసి రజాకార్ సినిమా చూద్దాం రండి అంటూ ఆహ్వానం పలికారు.
సెన్సార్ బోర్డుకి, పోలీసులకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అరాచకాల గురించి కేసీఆర్ మీకు చెప్పలేదా అని ఎద్దేవ చేశారు. టీజర్ కే భయపడి నిజాం వారసులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాజాసింగ్. బీజేపీ జోకర్ కాదని, హీరో అని అన్నారు. సినిమా చూసి డెసిషన్ తీసుకోవాలని కేటీఆర్ కు సూచించారు.
రజాకార్ టీజర్ ను షేర్ చేసిన ఓ నెటిజన్ కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సీన్స్ ఉన్నాయని అన్నాడు. దీనికి స్పందించిన కేటీఆర్.. రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం బీజేపీకి చెందిన కొందరు మత హింసకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన నిజాం అకృత్యాలను సినిమా చూపిస్తే మీకొచ్చిన బాధేంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే.. మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా కేటీఆర్ వ్యాఖ్యల్ని సమర్ధించారు. ప్రస్తుతం తెలంగాణలో గుడ్ గవర్నెన్స్ ఉందని.. రెచ్చగొట్టే సినిమాలు ఎవరు తీసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివాదాస్పద చిత్రాలపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.