బీజేపీ(BJP) 25 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని, ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్(Rajasingh) అన్నారు. ఇప్పటికే తమ పార్టీతో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని తెలిపారు. అవసరమైతే తమ పార్టీయే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాజాసింగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గోషామహల్లో తన గెలుపుపై నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని తెలిపారు. కాంగ్రెస్కు ఆధిక్యం, బీఆర్ఎస్ సీట్ల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయని పలు సంస్థలు వెల్లడించాయని, అయితే ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాదని వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతీ ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయని, అయితే వాస్తవ ఫలితాలకు, వాటికి చాలా తేడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే బీజేపీ సీట్ల సంఖ్య పెరగడం కాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని రాజాసింగ్ వెల్లడించారు. ఈసారి హంగ్ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, అందుకే అవసరమైన చోట కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారని రాజాసింగ్ ఆరోపించారు. బీఆర్ఎస్తో కలిసి ఆ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అయితే బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీతోనూ టచ్లో ఉన్నారని, బీజేపీ 25సీట్లు గెలుచుకుంటే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని వెల్లడించారు. అప్పుడు తామూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని స్పష్టం చేశారు.