ఏపీ(AP)లో సినిమా రాజకీయం సాగుతోంది. ‘రాజధాని ఫైల్స్’(Rajadhani Files) సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్లో అర్ధాంతరంగా సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. హైకోర్టు(High Court) ఆదేశాల మేరకు చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని నోటీసులు అందజేశారు.
ఏపీ రాజధాని కథాంశంగా భాను తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే అలనాటి అందాల తార వాణీ విశ్వనాథ్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న రాజధాని ఫైల్స్ గురువారం నుంచి థియేటర్లలో రిలీజ్ అయింది.
అయితే రాజధాని ఫైల్స్ సినిమాను ఆపాలంటూ వైసీపీ ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది. వైసీపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. టికెట్లు కొని చూస్తుంటే మధ్యలో ఎలా నిలిపివేస్తారని సినిమా చూడ్డానికి వచ్చిన వారు నిలదీశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే ఆపేశామని అధికారులు చెప్పారు.
ఆర్డర్ కాపీని చూపించాలని పట్టుబట్టారు. మరోవైపు గుంటూరు జిల్లా ఉండవల్లిలో సినిమా ప్రదర్శన నిలిపివేతపై రైతులు ధర్నాకు దిగారు. రామకృష్ణ థియేటర్ వద్ద టీడీపీ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమా ప్రదర్శనను నిలిపివేసినట్లు యాజమన్యం తెలిపింది.