టీఆర్ఎస్(TRS)ను బీఆర్ఎస్(BRS)గా పేరు మార్చిన నాడే తెలంగాణ (Telangana)తో ఆ పార్టీకి ఉన్న పేగుబంధం తెగిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Rajagopal Reddy) ఎద్దేవా చేశారు. నేడు అసెంబ్లీలో జరిగిన కృష్ణా జలాల పంపకాలపై ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే ఎక్కువ దోపిడి జరిగిందని ఫైర్ అయ్యారు.
భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారమని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏనాడైతే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన నాడే తెలంగాణతో వారి పేగు బంధం తెగిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నోటికొచ్చినట్లుగా బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా.. ఇంకా మీకు బుద్ధి రాలేదా అంటూ రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ సభ జన సమీకరణ చేసేందుకు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఊరూరా తిరుగుతున్నారనీ… అందుకే ఇవాళ అసెంబ్లీకి హాజరు కాలేదన్నారు. హరీశ్‌రావుకు మేనమాన సాలొచ్చిందనీ… అబద్ధాలు ఆడటంలో ఆయనను మించిపోయాడని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా చూపించారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అధికార దాహంతో, అవినీతికి పాల్పడి పక్క రాష్ట్రంలోని సీఎం జగన్‌తో కుమ్మక్కై.. బీఆర్ఎస్ పేరు పెట్టి ప్రధాని పీఠానికే టెండర్ పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు