గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh)పై విధించిన సస్పెన్షన్‌ను భారతీయ జనతా పార్టీ(BJP) ఎత్తివేసింది. ఈమేరకు సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీజేపీ అధిష్ఠానం ఉత్తర్వులు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గతంలో రాజాసింగ్‌పై బీజేపీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
ఏడాది కిందట హైదరాబాద్‌కు వివాదాస్పద కమెడియన్ మునావర్ ఫారుఖీ రావడానికి అనుమతించిన ప్రభుత్వ తీరును రాజాసింగ్ వ్యతిరేకించారు. మహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కూడా నమోదైంది. జైలుకు వెళ్లిన ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.
కొంతకాలంగా తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని రాజాసింగ్ పలుమార్లు పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్ర నాయకత్వం సుముఖంగానే స్పందించినప్పటికీ జాతీయ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈనేపథ్యంలో రాజాసింగ్ పార్టీ మారుతారనే చర్చ జరిగింది. వీటిని తీవ్రంగా ఖండించారు రాజాసింగ్. అవసరమైతే రాజకీయాల నుంచి వైదొలుగుతా కానీ.. వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
మరోవైపు బీజేపీ తొలి జాబితా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. మరోసారి గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ రాజాసింగ్‌కే కేటాయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి ఆయా అభ్యర్థులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో పోటీ చేయడం ఖాయంగానే తెలుస్తోంది.
ఎమ్మెల్యే @TigerRajaSingh గారిపై @BJP4India సస్పెన్షన్ ఎత్తివేసింది. pic.twitter.com/DvvH8onZ5l
— BJP Telangana (@BJP4Telangana) October 22, 2023