రాజస్థాన్(Rajasthan)లోని సికార్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం(Accident) చోటుచేసుకుంది. ట్రక్కును ఢీకొనడంతో ఓ కారులో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఓ కుటుంబం రాజస్థాన్‌లోని సలాసర్‌లో గల బాలాజీ ఆలయానికి కారులో బయల్దేరారు.
ఈక్రమంలో చురు వైపు వెళ్తుండగా కారు డ్రైవర్ ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ట్రక్కును ఢీకొట్టాడు. దీంతో కారులోని గ్యాస్ కిట్‌లో మంటలు చెలరేగాయి. ట్రక్కులో లోడ్ చేసిన కాటన్ మంటలు దావణంలా వ్యాపించాయి. దీంతో స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కారులో ఉన్నవారంతా సజీవ దహనమయ్యారు.
మృతులు నీలం గోయల్ (55), ఆమె కుమారుడు అశుతోష్ గోయల్ (35), మంజు బిందాల్ (58), ఆమె కుమారుడు హార్దిక్ బిందాల్ (37), అతని భార్య స్వాతి బిందాల్ (32), వారి ఇద్దరు మైనర్ కుమార్తెలుగా గుర్తించారు. లారీ డ్రైవర్, హెల్పర్ ఘటనాస్థలం నుంచి పారిపోయారు. పోలీసుల విచారణలో కారు యజమాని అశుతోష్‌గా గుర్తించారు. అతడు ఏడాదిన్నర కిందట కారును విక్రయించినట్లు తెలిపాడు. పోలీసులు కారు విక్రయించిన ఏజెంట్‌ను సంప్రదించి అతడి ద్వారా కుటుంబాన్ని గుర్తించగలిగారు.
కారులో ఉన్నవారు డోర్లు తీసేందుకు ప్రయత్నించేలోపే ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఊపిరాడక బయటకు రాలేకపోయారని తెలుస్తోంది. మరోవైపు కార్ డోర్లు లాక్ చేసి ఉండటంతో స్థానికులకు డోర్లు తీయడానికి కష్టంగా మారింది. మంటలంటుకోవడాన్ని చూసి వెంటనే సాయం చేయడానికి ప్రయత్నించానని, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి చూసేసరికి కారులో ఉన్నవారంతా మృతిచెందారని ప్రత్యక్ష సాక్షి రామ్నివాస్ సైనీ తెలిపాడు.