Telugu News » Rajasthan : ముగిసిన ప్రచార పర్వం…. రేపే పోలింగ్….!

Rajasthan : ముగిసిన ప్రచార పర్వం…. రేపే పోలింగ్….!

డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు.

by Ramu

రాజస్థాన్‌ ( Rajasthan)లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ నియోజక వర్గాలను రేపు పోలింగ్ (Polling) నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు. మొత్తం 5,26,90,146 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

 

రాష్ట్రంలో మొత్తం 2కోట్ల 73 లక్షల మందికి పైగా పురుష ఓటర్లు, 2కోట్ల 52 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో 80 ఏండ్లకు పైబడిన వారు 51,033, 11,894 దివ్యాంగులైన ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో విజయంపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలను నమ్ముకుని ఈ ఎన్నికలో ప్రచారం నిర్వహించింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వస్తే ప్రజలకు ఏడు గ్యారెంటీలు అమలు చేస్తామని అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు ఏడాదికి రూ. 10,000 జమ చేస్తామని పేర్కొంది. గ్యాస్ సిలిండర్ ను రూ. 500లకే అందిస్తామని హామీల వర్షం కురిపించింది. ప్రజలను బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రచారం చేసింది.

ఇది ఇలా వుంటే గెహ్లాట్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ ప్రచారం సాగింది. రాజస్థాన్ లో ఇటీవల అవినీతి భారీగా పెరిగిందని ప్రధాని మోడీ నేతృత్వంలో కాషాయ పార్టీ నేతలు ప్రచారం చేశారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిందని, మహిళలపై అత్యాచారాల్లో దేశంలోనే రాజస్థాన్ ప్రథమ స్థానంలో ఉందంటూ గెహ్లాట్ సర్కార్ కు వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం చేసింది.

రాష్ట్రంలో మొత్తం 36,101 చోట్ల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పట్టణ ప్రాంతాల్లో 10,501, గ్రామీణ ప్రాంతాల్లో 41,006 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఈసీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 65,277 ‘బ్యాలెట్ యూనిట్లు’, 62,372 ‘కంట్రోల్ యూనిట్లు’, 67,580 వీవీ ప్యాట్ యంత్రాలను రిజర్వ్ ఓటింగ్ కోసం వినియోగిస్తున్నట్టు తెలిపింది.

You may also like

Leave a Comment