ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్(Bharath) సిద్ధంగా ఉందని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnathsingh) వెల్లడించారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఉపయోగించి భారతను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పాకిస్థాన్(Pakistan) పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
పాక్‌కు చేతకాకుంటే తాము సహకరిస్తామని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను నిర్మూలించే ప్రయత్నంలో 2020 నుంచి భారత ప్రభుత్వం పాకిస్తాన్లో లక్షిత హత్యలు చేసిందంటూ గార్డియన్‌లో వచ్చిన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు భారత రక్షణ మంత్రి స్పందిస్తూ ‘ఘుసే మారేంగే’(పాక్‌లోకి ప్రవేశించి చంపేస్తాం) అంటూ తెలిపారు.
ఎమర్జెన్సీ సమయంలో తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తనకు పెరోల్ ఇవ్వలేదని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తమను నియంతలుగా పిలుస్తోందంటూ దుయ్యబట్టారు. సరిహద్దు దాటి పారిపోయే ఉగ్రవాదులను హతమార్చేందుకు పాక్‌లోకి ప్రవేశించేందుకు భారత్ వెనుకాడబోదని స్పష్టం చేశారు. భారత్ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయలేదని, అలాగే ఏ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించలేదన్నారు.
ఎవరైనా భారతదేశానికి లేదా దాని శాంతికి బెదిరింపులకు పాల్పడితే మాత్రమం వారిని విడిచిపెట్టబోమని పునరుద్ఘాటించారు. అయితే రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ స్పందిస్తూ అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలని కొట్టిపారేసింది. పాకిస్థాన్ తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని చరిత్ర చూస్తే తెలుస్తుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.