రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఆవిష్కరణలు రానున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్(Rajnath Singh) అన్నారు. ఇవాళ(ఆదివారం) ఉదయం దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమి(Dundigal Airforce Academy)లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్(Combined Graduation Parade) జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా యువ పైలట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సైనికాధికారుల విన్యాసాలను వీక్షించారు. శిక్షణ పొందిన 212 మంది యువ పైలైట్లు పాల్గొన్నారు. పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్-30, సారంగ్ హెలికాఫ్టర్లతో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ‘క్యాడెట్లుగా ఉన్నప్పుడు విద్యార్థులుగా ఉంటారు.. శిక్షణ పొందుతుంటారు కానీ.. నేటితో మీరంతా ఆఫీసర్లుగా మారబోతున్నారు.. ఇప్పటి నుంచి మీపై భాధ్యత మరింత పెరుగుతుంది..’అంటూ రాజ్‌నాథ్ సింగ్ క్యాడెట్లకు సూచించారు.
‘శిక్షణలో ఉన్నన్ని రోజులు మీరు మీ తల్లిదండ్రులకు, కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉన్నారు. ఈరోజుతో మీ శిక్షణ ముగిసింది.. కానీ.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రెడిషన్, ఇన్నోవేషన్.. రెండింటినీ అర్థం చేసుకుంటూ సమన్వయంతో ముందుకెళ్లాలి.’ అంటూ యువ పైలట్లకు కేంద్ర మంత్రి పలు సూచనలు చేశారు.