రాజస్థాన్ (Rajasthan) నుంచి రాజ్యసభ (Rajya Sabha)కు కాంగ్రెస్ (Congress) అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోనియాతో పాటు బీజేపీ (BJP) నేతలు చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జైపూర్ అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. మంగళవారం రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కానుంది.
ఈ నేపథ్యంలో బరిలో మరెవరు లేకపోవడం ఫలితంగా వీరి ఎన్నిక జరిగింది. ఈమేరకు ఈ ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా రాజ్యసభ (Rajya Sabha)కు ఎన్నికైనట్లు అధికారి తెలిపారు. మరోవైపు రాజస్థాన్‌లో మొత్తం 10 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఫలితాల తర్వాత కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి నలుగురు సభ్యులు ఉన్నారు. ఇదిలా ఉండగా గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికైన రెండో నాయకురాలు సోనియా గాంధీ కావడం విశేషం.
ఇక దాదాపు 25 ఏళ్ల పాటు వరుసగా లోక్‌సభ సభ్యురాలిగా పనిచేసిన ఆమె.. రాజ్యసభలో అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకు ఎగువ సభలో సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ (Telangana) లోనూ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది.
రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు ముగ్గురే బరిలో ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. కాగా మూడు స్థానాల్లో కాంగ్రెస్ (Congress) నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి వద్దిరాజు రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.