అయోధ్యలో జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన (Consecration of Ram Lalla)ను సాహసోపేతమైన పనిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ (RSS Chief) మోహన్ భగవత్ (Mohan Bhagwat) అభివర్ణించారు. ఇది దేవుని ఆశీర్వాదం, కోరిక వల్లే ఇది జరిగిందని చెప్పారు. భారత్ నిరంతరం బలపడాలని అన్నారు.
ఒక వేళ ఏదైనా కారణం చేత భారత్ ఎదగకపోతే అది ప్రపంచ వినాశనానికి దారి తీస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర పూణే జిల్లాలోని అలండిలో గీతాభక్తి అమృత్ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొని మాట్లాడుతూ….. ‘రామ్ లల్లా తన స్థానంలో తాను నిల్చొని ఉండటాన్ని చూడటం ఇప్పటి తరం అదృష్టమని వెల్లడించారు.
రామ మందిర నిర్మాణం అనేది కేవలం అందరూ కలిసికట్టుగా పోరాటం చేయడం వల్ల మాత్రమే కాకుండా దేవుని ఆశీర్వాదం వల్ల జరిగిందన్నారు. ప్రాణ ప్రతిష్ట వేడుకలో పాల్గొనడం తన అదృష్టమని భగవత్ అన్నారు. భారత్ ఎంతో ఎత్తుకు ఎదగాలని తెలిపారు. అంతేగాక బలంగా ఉండాలని చెప్పారు.
ఏదైనా కారణం చేత భారత్ ఎదగకుంటే ప్రపంచం అతి త్వరలో వినాశనాన్ని ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొందని వివరించారు. ప్రపంచంలోని మేధావులకు ఈ విషయం తెలుసన్నారు. అందుకే దీని గురించి చెబుతూ రాసుకుంటున్నారని వెల్లడించారు. భారత్ తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఎంతో ఎత్తుకు ఎదగాలన్నారు.