గత పదేండ్లలో భారత్ ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం చూశామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని (Ram Mandhir) నిర్మించాలనే శతాబ్దాల నాటి ఆకాంక్ష నెరవేరిందని తెలిపారు. దేశంలో మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ పని చేస్తోందని వెల్లడించారు. ప్రపంచం మొత్తం సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలోనూ కేంద్రం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచిందన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ కొత్త భవరనంలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. గత ఏడాది భారత్ అద్బుతమైన విజయాలను అందుకుందని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దేశం మారింన్నారు. చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు.
భారత్ నిర్వహించిన జీ20 సమ్మిట్ ప్రపంచంలో భారత్ పాత్రను బలోపేతం చేసిందని వివరించారు. ఆసియా క్రీడల్లో భారత్ 100కు పైగా పతకాలు సాధించిందని పేర్కొన్నారు.. భారత్‌లో అటల్ టన్నెల్ వచ్చిందని అధ్యక్షుడు ముర్ము చెప్పారు. దేశంలో నక్సలైట్ల సంబంధిత సంఘటనలు గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. ఎంఎస్ఎంఈలు, చిన్న పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించేందుకు తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తోందని వివరించారు.
దేశంలో రైతులకు మద్దతు ధర కింద రూ. 18 లక్షల కోట్లను వెచ్చించామన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రజలంతా కొన్ని శతాబ్దాల పాటు ఎదురు చూశారని తెలిపారు. ఇప్పుడు రామ్‌లల్లా భవ్యమందిరంలో కొలువు దీరాడని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల ఆశయం దీంతో నెరవేరిందని చెప్పారు. ఆ పండుగను దేశ ప్రజలు సంబురంగా జరుపుకున్నట్లు వివరించారు.
‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ దేశాన్ని శక్తివంతంగా తయారు చేశాయన్నారు. వీటి వల్ల రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రూ.లక్ష కోట్ల మార్కును దాటిందని చెప్పారు. చిన్న నాటి నుంచి గరీబీ హటావో అనే నినాదాన్ని వింటున్నామని…. కానీ తొలిసారి విస్తారమైన స్థాయిలో పేదరిక నిర్మూలన జరిగిందని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. భారత్ 1200 కోట్ల యూపీఐ లావాదేవీలను నమోదు చేసిందని చెప్పారు. భారత్ అంతటా బ్రాడ్ బ్యాండ్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య 14 శాతం పెరిగిందని చెప్పారు. భారత డిజిటల్ పురోగతి ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయన్నారు.