అయోధ్య (Ayodhya) రామ మందిర (Ram Mandhir) ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ పై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ (Acharya Satyendra Das) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు హాజరుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్ సాకులు వెతుకుతోందన్నారు. రామ మందిరం అసంపూర్తిగా ఉందని, నాలుగు పీఠాల శంకరాచార్యులు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ఆహ్వాన్ని తిరస్కరించారన్న వార్తలపై ఆయన స్పందించారు.
శ్రీ రామ జన్మభూమిలో ఆలయం నిర్మాణం శాస్త్ర ప్రకారం జరుగుతోందని వెల్లడించారు. ఆలయంలో రామ్ లల్లాకు సంబంధించిన ప్రతీది సిద్ధంగా ఉందన్నారు. ఆలయంలో మొదటి ఫేజ్ నిర్మాణం పూర్తయిందన్నారు. ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉందని, ప్రాణప్రతిష్ట శాస్త్రాల ప్రకారం జరగడం లేదన్న విషయాన్ని ఆయన ఖండించారు.
ప్రాణప్రతిష్టకు శంకరాచార్యులు హాజరు కావడంలేదనే విషయంపై స్పందించేందుకు సత్యేంద్ర దాస్ నిరాకరించారు. శంకరాచార్యుల ఆలోచనలను, వారి భావాలను తాము ప్రశ్నించలేమని తెలిపారు. రామ మందిరాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందన్న వాదనలపై ఆయన మాట్లాడారు. రాజనీతి, ధర్మనీతి అనే రెండు అంశాలు ఉంటాయని చెప్పారు.
శ్రీరామున్ని బీజేపీ సొంతం చేసుకున్నదని పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీకి ఆయన ఆశీస్సులు దక్కాయని తెలిపారు. ఇది రాజనీతి కాదు అని, కానీ దీన్నే ధర్మనీతి అంటారని వెల్లడించారు. ఇప్పుడు రామరాజ్యం రాబోతోందని తెలిపారు. రామ్ లల్లాను శాశ్వత ఆలయంలోకి మార్చాలన్న ప్రయత్నాలను మరే పార్టీ చేయలేదని తేల్చి చెప్పారు.