ఈ నెల 22న జరిగే శ్రీరాముడి విగ్రహప్రతిష్ఠాపణ కార్యక్రమానికి అయోధ్య రామాలయం(Ram Temple) ముస్తాబవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖుల కుటుంబాలకు, కరసేవకులకు ఆహ్వానాలు అందాయి. అయితే, ముఖ్యమంత్రుల్లో మాత్రం ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు తప్ప మరే సీఎంకూ ఆహ్వానం అందలేదు.
కాగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మినహా దేశంలోని మరే సీఎంకు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందలేదని రామాలయ వర్గాలు తెలిపాయి. రామజన్మ భూమి ఉద్యమం సందర్భంగా ప్రాణత్యాగం చేసిన కరసేవకుల కుటుంబాలకు సైతం ఆహ్వానాలు అందినట్లు సమాచారం.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌధరిలకు ఆహ్వానాలు అందినప్పటికీ.. తాము ఈ కార్యక్రమానికి హాజరుకావడంలేదని వారు ప్రకటించారు. అయితే, ఆహ్వానం అందిన దళిత ప్రముఖుల కుటుంబాల్లో బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్‌రామ్, కాన్షీరామ్ కుటుంబాలు ఉండటం విశేషం.
మరోవైపు శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రధాన కార్యక్రమానికి వారం రోజులు ముందుగా ఈ నెల 16వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో 22న రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు.