విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraj) జిల్లాలో చోటు చేసుకొంది. రంపచోడవరం (Rampachodavaram) మండలం ఐ. పోలవరం గ్రామం సీతపల్లి వాగు (Seethapalli Vagu)లో సరదాగా గడుపుదామని వెళ్ళిన వారి పాలిట ఆ వాగు మృత్యు కుహరంగా మారింది.
స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు నిన్న రంపచోడవరం విహారయాత్రకు వెళ్లారు. సీతపల్లి వాగులో స్నానం చేస్తుండగా వారిలో ముగ్గురు వాగు లోతుల్లోకి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. మిగిలిన ఇద్దరూ బయట పడ్డారు. వారిలో వీర వెంకట అర్జున్, అండిబోయిన దేవి చరణ్, లావేటి రామన్ లు గల్లంతు అయ్యారని సమాచారం.
కాగా ప్రమాద సమాచారం అందుకొన్న రంపచోడవరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. వాగులో గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలు వెలికితీశారు.. అనంతరం పోస్టుమార్టం కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి మరణంతో రంప ఎర్రంపాలెంలో విషాదం నెలకొంది. ఈ ఘటన మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. చక్కని భవిష్యత్తు ఉన్న పిల్లలు మృతి చెందడంతో.. వారి కుటుంబ సభ్యుల దుఃఖాన్ని అదుపుచేయడం ఎవ్వరివల్ల కాలేదు..