రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లోని రాజేంద్రనగర్(Rajendra Nagar)లో భారీగా గంజాయి చాక్లెట్స్ గుట్టు రట్టయింది. నాలుగు కిలోల గంజాయి చాక్లెట్స్(Cannabis chocolates)ను రంగారెడ్డి జిల్లా((Ranga Reddy District) ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు (Excise Enforcement Officers) సీజ్ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించామన్నారు.
ఇక, కోకాపేట్ రాంకీ కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ గదిలో వివిధ బ్రాండ్స్‌కు చెందిన గంజాయి చాక్లెట్స్ ఉన్నట్లు గుర్తించారు. ఒడిస్సాకు చెందిన సౌమ్యా రాజన్ అనే వ్యక్తిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఒడిస్సా నుంచి గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు రోజు కూలీలకు ఈ చాక్లెట్స్ విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒడిస్సాలో తక్కువ ధరకు గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు.
విద్యార్థులకు గంజాయి చాక్లెట్లను అలవాటు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్స్ సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎక్సెజ్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్స్ దందాను ఎంత కాలం నుంచి కొనసాగిస్తున్నారు? ఎవరెవరికి విక్రయించారు? అనే సమాచారంపై అధికారులు కూపీ లాగుతున్నారు.