మన పథకాలు కాపీ కొడుతున్నారు.. తెలంగాణను నెంబర్ వన్ గా చేశాం.. దేశానికే ఆదర్శం.. ఇవన్నీ బీఆర్ఎస్ నేతలు నిత్యం వల్లె వేసే మాటలు. ప్రతిపక్షాల వెర్షన్ లో మాత్రం ఇది మాటల గారడీ. చేసేది తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్నట్టుగా గులాబీ గ్యాంగ్ తీరు ఉందని విపక్ష నేతలు తిట్టిపోస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని.. దేశంలో ఇది ఎవరి వల్ల సాధ్యం కాలేదని చెబుతున్న తీరుకు.. వాస్తవానికి చాలా తేడా ఉందని అంటున్నారు.
తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వాస్పత్రిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. ప్రగతినగర్ కు చెందిన పెరికల రవి అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. అయితే.. పోస్టుమార్టం సమయంలో కుటుంబ సభ్యులు.. అతడి ముఖంపై గాయాలను గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా.. ముఖం, బుగ్గలు, నుదుటిపై ఎలుకలు కొరికిన గుర్తులు ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు.. డాక్టర్లు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకల బాధలు అన్నీ ఇన్నీకావు. గతంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో.. చికిత్స పొందుతున్న రోగిని ఎలకలు దారుణంగా కొరికాయి. ఆ తర్వాత అతను చనిపోయాడు. ఈ ఘటన తర్వాత.. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలోని ఐసీయూ, ట్రామాకేర్ విభాగంలో ఎలుకల గుంపుగా సంచరించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. గతంలో ఉస్మానియా మార్చురీలో భద్రపరిచిన యువతి శవాన్ని ఎలుకలు, పందికొక్కులు కొరికాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలతో పేషెంట్లు, బంధువులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఘటనలు ఉన్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొరవడిన పారిశుద్ధ్య నిర్వహణ కారణంగానే ఎలుకలకు అవి ఆవాసంగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, పొంగిపొర్లే డ్రైనేజీలతో అపరిశుభ్రత కారణంగా ఎలుకలు, పంది కొక్కులు ఆస్పత్రుల్లో తిష్ట వేస్తున్నాయని.. ఒక్కోసారి వాటికోసం పాములు సైతం వస్తున్నాయని చెబుతున్నారు బాధితులు. గులాబీ నేతలు మీడియా ముందు డబ్బాలు కొట్టుకోవడం కాదు.. వాస్తవంగా జరుగుతున్న పరిస్థితిలో మార్పులు తీసుకురావాలని ప్రతిపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు.