Telugu News » కేటీఆర్ వర్సెస్ గవర్నర్.. డైలాగ్ వార్

కేటీఆర్ వర్సెస్ గవర్నర్.. డైలాగ్ వార్

by admin
War of Words Between KTR and Tamilisai

తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి సహకరించడం లేదంటూ బీఆర్ఎస్ వర్గాలు తరచూ టార్గెట్ చేస్తుంటాయి. ఆమె కూడా అదే రేంజ్ లో కౌంటర్స్ ఇవ్వడం.. వాటికి గులాబీ గ్యాంగ్ ఎదురుదాడి చేయడం ఈమధ్య కాలంలో కామన్ అయిపోయింది. తాజాగా మరోసారి అగ్గి రాజుకుంది. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తమిళిసై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

War of Words Between KTR and Tamilisai

తెలంగాణ కేబినెట్ సోమవారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 50 అంశాలపై చర్చించారు మంత్రులు. వీటిలో గవర్నర్ తిప్పి పంపిన బిల్లుల అంశం కూడా ఉంది. భేటీ తర్వాత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్‌ తిప్పి పంపిన మున్సిపల్, పంచాయతీ రాజ్, విద్యాశాఖలకు సంబంధించిన 3 బిల్లులను మళ్లీ శాసనసభలో ఆమోదించి.. రాజ్‌ భవన్‌ కు పంపాలని కేబినెట్‌ నిర్ణయించిందని తెలిపారు. శాసనసభ రెండోసారి పాస్‌ చేసిన బిల్లుల విషయంలో గవర్నర్‌ కు మరో గత్యంతరం ఉండదని.. రాజకీయంగా ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నా రాజ్యాంగం ప్రకారం ఆమోదించక తప్పదని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయమని స్పష్టం చేశారు. గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని కేంద్రం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో గవర్నర్ తాజాగా పరోక్షంగా స్పందించారు. ‘‘నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. బిల్లులు ఎందుకు తిరస్కరించానో కారణాలు స్పష్టంగా వివరించాను. వాటిని తిప్పి పంపడం నా ఉద్దేశం కాదు. ప్రభుత్వం కావాలని నన్ను బద్నాం చేస్తే నేను బాధ్యురాలిని కాను. నేను రాజకీయమైన యాక్టింగ్ చేయడం లేదు. నేను చెప్పిన కారణాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం’’ అని మాట్లాడారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

పెండింగ్ బిల్లుల వ్యవహారంపై గతంలో తెలంగాణ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తం 10 బిల్లులకు గాను.. మూడింటికి తమిళిసై ఆమోదముద్ర వేశారు. రెండింటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా.. మరో 2 బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. మిగిలిన 3 బిల్లుల్లో ఒకటి తిరస్కరించారు. మరో 2 బిల్లులపై అదనపు వివరణ కోసం తిరిగి ప్రభుత్వానికి పంపించారు. దీంతో గవర్నర్ తీరుపై ప్రభుత్వం సైడ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తమిళిసై రియాక్ట్ కావడంతో మరోసారి ఈ వివాదం ఇంట్రస్టింగ్ గా మారింది.

You may also like

Leave a Comment