దేశవ్యాప్తంగా దసరా పండుగ(Dasara festival) వైభవంగా జరుగుతోంది. చెడుపై మంచి విజయం సాధించిన రోజును విజయదశమి (vijayadashami)గా చెప్తుంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన రోజుగా, అలాగే రాముడు రావణాసురుడిని హతమార్చిన రోజుగా దీనికి ప్రత్యేకత ఉంది. ఈ పండుగ రోజే దేశంలోని అన్ని ప్రాంతాల్లో సహజంగా రావణాసురిడి బొమ్మను రూపొందించి దాన్ని దహనం చేస్తారు. కానీ, మన దేశంలోనే ఓ చోట మాత్రం దసరా తర్వాత 5 రోజుల తర్వాత రావణదహనం చేస్తారు.
ఉత్తరప్రదేశ్లోని కానోజ్ జిల్లాలో దసరా వేడుకలు మాత్రం కాస్త భిన్నంగా జరుగుతాయి. లంకాధిపతి రావణుడి విగ్రహాన్ని దహన కార్యక్రమం దసరా పండుగ అయిపోయిన తర్వాత చేస్తారు. 200 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం నడుస్తోంది. లంకాధిపతి రావణుడు దసరా రోజున తన ప్రాణాలను విడిచిపెట్టలేదు. దసరా పండుగ తర్వాత వచ్చే శరత్ పౌర్ణమి రోజున రావణుడు తన ప్రాణాలను విడిచిపెట్టాడు. అందువల్ల అక్కడి ప్రజలు 200 సంవత్సరాలకు పైగా దసరా పండుగ 5వ రోజున శరత్ పౌర్ణమి నాడు రావణుడి దహన కార్యక్రమం చేస్తారు.
శ్రీరాముడు, లంకాపతి రావణుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు, విభీషణుడి ఆదేశం మేరకు, శ్రీరాముడు రావణుడి నాభిలో ఒక బాణం వేస్తాడు. దీంతో అతడి నాభి నుంచి అమృతం వెలువడుతుంది. ఆ తర్వాత సుమారు 5 రోజుల పాటు రావణుడి ప్రాణం విడిచిపెట్టలేదు. రాముడి బాణం తగిలాక రావణుడు ఆకాశం నుండి స్పృహతప్పి నేలపై పడిపోతాడు. అప్పుడు శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడితో రావణుడు గొప్ప జ్ఞాని.. నీవు వెళ్లి అతడి నుంచి జ్ఞానాన్ని తీసుకో అని చెప్తాడు.
శ్రీరాముని ఆజ్ఞను స్వీకరించిన తర్వాత లక్ష్మణుడు జ్ఞానాన్ని పొందేందుకు రావణుని వద్దకు వెళ్తాడు. రావణుడు లక్ష్మణుడికి జ్ఞానం అందించడానికి 5 రోజులు పడుతుంది. ఆ తర్వాత శరత్ పూర్ణమి రోజున.. శ్రీరాముని పేరును తలచుకుంటూ తన ప్రాణాలను విడిచిపెట్టాడు రావణుడు. ఈ నమ్మకాన్ని నమ్ముతూ కనౌజ్ జిల్లాలో రావణుడిని వధించి దహనం చేసే ఆచారం 200 ఏళ్లకు పైగా కొనసాగుతోంది.