తెలంగాణ నూతన డీజీపీగా ( DGP) రవి గుప్తా (Ravi Guptha) నియమితులయ్యారు. డీజీపీగా రవి గుప్తాను నియమిస్తున్నట్టు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ తర్వాత సీనియర్‌గా రవి గుప్తారు. ఈ నేపథ్యంలో ఆయన్ని డీజీపీగా ఎన్నికల సంఘం నియమించింది.
రవి గుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పని చేస్తారు. దీంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన విధులు నిర్వహించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల ఫలితాలకు ముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అంజనీ కుమార్ కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని ఆయన సస్పెన్షన్ వేటు వేసింది.
మరోవైపు అంజనీ కుమార్‌తో పాటు అదనపు డీజీలు సందీప్ కుమార్ జైన్, మహేశ్ భగవత్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. అంతకు ముందు రేవంత్ రెడ్డిని అంజనీ కుమార్ కలిశారు. ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారని అంజనీ కుమార్ తెలిపారు.