రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను వరుసగా 5వసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం ఓ ప్రకటన చేశారు. వడ్డీ రేట్లు.. 6.5శాతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇక 2024 ఆర్థిక ఏడాదికి సంబంధించి.. భారత దేశ వాస్తవ జీడీపీ అంచనాలను 6.5శాతం నుంచి 7శాతానికి పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ (Governor) వెల్లడించారు.
మరోవైపు ఆర్బీఐ (RBI) గవర్నర్.. ఎఫ్వై25 క్యూ1 రియల్ జీడీపీ 6.7శాతం నమోదవుతుందని అంచనా వేశారు. అదే సమయంలో.. 2024 ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం 5.4శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. కీలక వడ్డీ రేట్లను 6.5శాతం దగ్గరే ఉంచాలని మానిటరీ పాలసీ మీటింగ్‌లో (MPC Meeting) ఏకగ్రీవంగా అంగీకరించినట్టు వెల్లడించారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉందని తెలిపిన శక్తికాంత దాస్ (Shaktikanta Das)..అప్పులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు వంటివి ఇందుకు కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుందని వివరించారు.
ఇక గతేడాది నుంచి వడ్డీ రేట్లను 2.5శాతం పెంచుతూ వచ్చింది ఆర్బీఐ. ఆ తర్వాత నుంచి వరుసగా ఐదోసారి.. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. కానీ అమెరికా ఫెడ్‌తో పాటు అనేక దేశాల బ్యాంక్‌లు ఏడాది కాలంగా వడ్డీ రేట్లను పెంచాయి. కాగా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ మొదలైతే..ఇండియా తో పాటు ఇతర దేశాల్లో కూడా రేట్ కట్స్‌ని చూసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ప్రకటనతో నిఫ్టీ మరో ఆల్‌టైమ్ హైని తాకింది. ఉదయం 10:10 నిమిషాల సమయంలో 21వేల మార్క్‌ను టచ్ చేసింది.