దేశంలో మరో నెల రోజుల్లో పరీక్షల సీజన్ (Exams Season) మొదలు కానుంది. ప్రాక్టికల్స్, వార్షిక పరీక్షలు ఇలా వరుస ఎగ్జామ్స్‌తో విద్యార్థులంతా బిజీగా మారనున్నారు. ఈ పరీక్షల నేపథ్యంలో వారిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీంతో పరీక్షల పట్ల విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ప్రధాని మోడీ ‘పరీక్షా పే చర్చ’(Pariksha Pe Charcha)కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ ఏడాది నిర్వహించే ‘పరీక్షా పే చర్చా’ఏడవ ఎడిషన్ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు జనవరి 12లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం https://innovateindia.mygov.in/ వెబ్ సైట్ ను దర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.
‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమ నిర్వహణ తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. త్వరలోనే కార్యక్రమ తేదీని ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. విద్యార్థులు తాము అడగదలుచుకున్న ప్రశ్నలను 500 అక్షరాలకు మించకుండా ముందే చెప్పాల్సి ఉంటుంది.
My Govలో పోటీల ద్వారా ఎంపికైన దాదాపు 2050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా పరీక్షా పే చర్చా కిట్‌లను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బహుమతిగా అందజేయనుంది. గతేడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 38 లక్షల మంది విద్యార్థులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.