టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో.. దేశవ్యాప్తంగా 4జీ, 5 జీ ఇంటర్నెట్ తో మరో సంచలనానికి తెరతీసింది. అతి సామాన్యునికి కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చింది. కానీ అంతటితో ఆగిపోలేదు. తన విజయాల పరంపరను కొనసాగిస్తూ టెలికం రంగంలో కొత్త కొత్త విప్లవాలను సృష్టిస్తుంది. ఈ క్రమంలో మరో ఆఫర్ ప్రకటించింది.
తక్కువ ధరకు ల్యాప్ టాప్ అదించడానికి రిలయన్స్ జియో (Reliance-Jio)..సిద్ధమవుతోంది. జియో సంస్థ నుంచి తక్కువ ధరకే ల్యాప్ టాప్ (Laptop)ను విడుదల చేస్తామని ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం రూ.15 వేలకు అంటే 184 డాలర్ల ధరకే ల్యాప్ టాప్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇప్పుడు తీసుకొచ్చే జియో క్లౌడ్ పీసీని కేవలం రూ. 15,000కి సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కాగా ఇప్పటికే జియో బుక్, జియో బుక్ 4జీ (Jio Book 4G) పేరుతో రెండు ల్యాప్‌టాప్‌లను రిలయన్స్ జియో తీసుకొచ్చింది. అయితే గతంలో విడుదల చేసిన జియో బుక్ 4జీ ధర రూ. 16,000గా ఉండగా, ప్రస్తుతం తీసుకొచ్చే జియో క్లౌడ్ పీసీని తక్కువ ధరకి అందించాలనే ఆలోచన చేస్తున్నట్టు రిలయన్స్ జియో సంస్థ తెలుపుతుంది.
ఈ మేరకు ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థలైన హెచ్‌పీ, లెనోవా, ఏసర్‌లతో చర్చలు జరుపుతోంది. ల్యాప్‌టాప్ ధర.. స్టోరేజ్, ప్రాసెసర్, చిప్‌సెట్, బ్యాటరీతోపాటు ఇతర హార్డ్‌వేర్ భాగాల ఆధారంగా ధర నిర్ణయిస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అయితే జియో క్లౌడ్ పీసీ సిస్టమ్ ప్రాసెసింగ్ మొత్తం జియో క్లౌడ్‌లో జరుగుతుండటం వల్ల తక్కువ ధరకే వినియోగదారులకు ల్యాప్‌టాప్ అందుబాటులోకి వస్తుందని చెప్పుకొచ్చారు.
అయితే ఈ ల్యాప్‌టాప్ ధర తక్కువే అయినా.. క్లౌడ్ సేవలు వినియోగించుకోవడం కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకోవాల్సి ఉంటుందని.. దీంతో యూజర్లు తమ ల్యాప్‌టాప్స్ లేదా స్మార్ట్ టీవీలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని సేవలను పొందొచ్చని జియో సంస్థ తెలుపుతుంది. ఇక ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌కు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.