తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చొరవతో ఢిల్లీ (Delhi) గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శనకు చోటు దక్కింది. ఈ అవకాశం మూడేండ్ల తర్వాత తెలంగాణకు దక్కడం విశేషం.. ఈ మేరకు తెలంగాణ శకటాన్ని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించనున్నారు.
మరోవైపు ఈ శకటం మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్‌తో రూపొందిందని సమాచారం.. తెలంగాణ సాయుధ పోరాటం ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగా జరిగింది. ఈ పోరాటం.. దేశ ప్రజాస్వామ పరిరక్షణలో భాగమనే చరిత్రను శకటం ద్వారా ప్రదర్శించబోతున్నది. ఎవరు సాయుధ పోరాటం చేసినా… అంతిమంగా అది హక్కుల కోసమే అనే భావనతో తెలంగాణ శకటం సిద్ధమైందని అంటున్నారు.
అదీగాక తెలంగాణ రాష్ట్రం ఉద్యమ నేపథ్యం నుంచి అభివృద్ధి వైపు ఎలా అడుగులు వేస్తున్నదో కూడా చూపించేలా రూపొందించినట్టు తెలుస్తుంది. ఆనాటి నిరంకుశ పాలన, తెలంగాణ ఆడ బిడ్డలకు జరిగిన అవమానాల గాథల నుంచి స్వరాష్ట్రం కోసం పుట్టిన ఉద్యమ తీరును దేశ ప్రజల కండ్లకు కట్టేలా శకటాన్ని సిద్ధం చేశారు.
ఈ శకటంపై తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఆదిలాబాద్ గోండు వీరుడు కొమురం భీం, బ్రిటీష్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్న రాంజీ గోండు, వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రదర్శించారు. మరోవైపు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఎందరో అమరుల త్యాగాలు స్మరించేలా శకటాన్ని రూపొందిస్తున్నది ప్రభుత్వం..