ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో నువ్వా నేనా అన్నట్టు బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్య వార్ జరుగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdary). బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. కురవి మండలం బలపాల గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ఎన్నికలు చారిత్రకమైనవని పేర్కొన్నారు రేణుకా చౌదరి. పువ్వాడ అజయ్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. దుర్మార్గుడు, దుష్టుడు అంటూ ఆయన డీఎన్ఏలోనే ప్రాబ్లం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన భవిష్యత్ కోసం తుమ్మలను గెలిపించాలని కోరారు. నిస్సహాయంగా ఉండొద్దన్న ఆమె.. ఓటు అనే బ్రహ్మాస్త్రంతో అజయ్ ను ఓడించాలని ప్రజలను కోరారు.
తుమ్మల కాంగ్రెస్ లో చేరడం తనకు గర్వంగా ఉందన్న రేణుకా చౌదరి.. పువ్వాడ అజయ్ ను మించి కేసీఆర్ అరాచకం చేశారన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలు తమవేనని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కొత్త సినిమాను ప్రజలు నమ్మరని.. ఈ ఎన్నికలలో ఆపార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ నేతలు అధికార మదంతో విర్రవీగుతున్నారని ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీలో పేపర్లు లీకై యువత జీవితాలతో ప్రభుత్వం ఆటలాడిందని.. ఐటీలో కేటీఆర్ కింగ్ అని చెప్పుకుంటూ.. కొలువులు ఇవ్వలేకపోయారని విమర్శించారు. రైతులకు బేడీలు వేసిన బీఆర్ఎస్ చరిత్రను మరువద్దని ప్రజలకు సూచించారు రేణుకా చౌదరి.