రాష్ట్ర వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day 2024) ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీచోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy), ఆయన సతీమణి భారతి, మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ నజీర్ స్వీకరించారు. అలాగే ఓపెన్ టాప్ జీపులో గవర్నర్ పరేడ్ రివ్యూ చేశారు. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్, సీఆర్పీఎఫ్ కంటింజెంట్, తమిళనాడు స్టేట్ పోలీస్ స్పెషల్ కంటింజెంట్ సహా కొన్ని కంటింజెంట్లను గవర్నర్ రివ్యూ చేశారు. ఈ శకటాల ప్రదర్శనలో ఎన్నికల సంఘం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు ఆవశ్యకతను తెలియజేసేలా శకటాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం ద్వారా విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిందన్నారు. పాఠశాలలకు రూ.17,805 కోట్లు వెచ్చించిందన్నారు. 15వేల గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అందిస్తోందన్నారు. 20 కీలక అంశాల్లో ప్రభుత్వ విజయాలను గవర్నర్ వివరించారు.
కుల, మత రాజకీయ వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నామని చెప్పారు. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా అందిస్తోందని తెలిపారు. వీటి ద్వారా 540 పౌర సేవలు ప్రజల ఇంటి దగ్గరే అందిస్తున్నామని, ఈ సేవలకు 1.35 లక్షల శాశ్వత సచివాలయం ఉద్యోగులు, 2.66 లక్షల వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లీనిక్స్ ద్వారా ప్రజలకు గ్రామాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నామని, రైతుల కోసం 10,778 ఆర్బీకేలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు గవర్నర్ వివరించారు.
అదేవిధంగా నగరంలోని ఆర్కేబీచ్లో భారీ త్రివర్ణ పతాక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహించారు. 400 మీటర్ల పొడవాటి త్రివర్ణపతాకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం పురోభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకొచ్చారని తెలిపారు. మరిన్ని రోజుల్లో మూడో స్థానంలో భారత్ నిలుస్తుందని జీవీఎల్ వెల్లడించారు.