బీఆర్ఎస్(Brs) పాలనలో ప్రజా ప్రతినిధులకు అవమానాలే ఎదురయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవాళ బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు పడిన అవస్థలు, వారికి ఎదురైన అవమానాలు తనకు తెలుసని రేవంత్ ఆ లేఖలో పేర్కొన్నారు.
నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని రేవంత్ అన్నారు. రేపటినాడు మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని భరోసానిచ్చారు. స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుదన్నారు. ఇక బీఆర్ఎస్-కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం.. అంటూ పిలుపునిచ్చారు.
‘స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బాధలు నాకు తెలుసు. ప్రజాక్షేత్రంలో వారిని కేసీఆర్ పురుగుల కంటే హీనంగా చూశారు.. బీఆర్ఎస్ పాలనలో ప్రజా ప్రతినిధులకు అవమానాలు ఎదురయ్యాయి.. నిధులు రాకుంటే వారి ఆస్తులు, బంగారం అమ్మి పనులు చేయించారు. వారికి నిర్ణయాధికారం లేక, నిధులు రాక ప్రజా ప్రతినిధులు పడిన బాధలు గుర్తున్నాయి..’ అని రేవంత్ పేర్కొన్నారు.
‘మీ ఆత్మగౌరవం కాపాడుకోండి.. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడండి.. మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది.. ఈ ఎన్నికల్లో పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా.. వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు.. కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు.. కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. అంటూ రేవంత్ కోరారు.