మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) జయంతి సందర్భంగా సోమాజిగూడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ (Congress) నేతలు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే (Manikrao Thakrey), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), జగ్గారెడ్డి (Jaggareddy), వీహెచ్ (VH) సహా ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ఒకే నాణానికి బొమ్మ, బొరుసు లాంటివని విమర్శించారు.
దేశ సంపదను తన మిత్రులకు మోడీ (Modi) దోచిపెడుతుంటే.. రాష్ట్ర సంపదను కేసీఆర్ (KCR) తన కుటుంబ సభ్యులకు ఇస్తున్నారని ఆరోపించారు రేవంత్. ఈ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమని.. అందుకే, వీటిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెస్ అయితే.. బ్రిటీష్ పాలకుల్లా విభజించు పాలించు విధానాన్ని అమలు చేస్తున్న చరిత్ర బీజేపీదని ఆరోపించారు. ఇందుకు మణిపూర్ ఘటనే నిదర్శనమని తెలిపారు. అసెంబ్లీలో మణిపూర్ ఇష్యూపై పల్లెత్తి మాట మాట్లాడని బీఆర్ఎస్.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కాంగ్రెస్ ను తిట్టడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.
యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు రేవంత్. అలాగే, గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది ఆయనేనని గుర్తుచేశారు. రాజీవ్ చేసిన కృషితోనే ఐటీ ఇంత అభివృద్ధి చెందిందన్నారు. పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారని.. టెలికాం రంగంలో మార్పులు తెచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు.
రాజ్యాంగ సవరణల ద్వారా సర్పంచ్, జెడ్పీటీసి ఎంపీటీసీలను బలోపేతం చేశారని తెలిపారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పోరాటం చేసిందని.. ప్రధానిగా నెహ్రూ.. హరిత విప్లవం, పంచవర్ష ప్రణాళికలతో దేశ అభ్యున్నతికి కృషి చేశారని వివరించారు. అలాగే, ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేయడం, పేదలకు భూముల పట్టాలు ఇప్పించారని అన్నారు. పాక్ పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం సాధించి పెట్టారని వివరించారు. పేదల కోసం గాంధీ కుటుంబం ప్రాణ త్యాగం చేసిందని తెలిపారు రేవంత్.