మంత్రులు కేటీఆర్ (KTR) , హరీశ్ రావుల (Harish Rao) పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మంత్రులిద్దరికీ ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. బిల్లా రంగాల్లాగా మారిన వాళ్లిద్దరూ ఊరు మీద పడి తిరుగుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలను మరుగుజ్జులు అంటూ చేస్తున్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మరుగుజ్జులెవరో, ప్రజల మనుషులు ఎవరో మరో 45 రోజుల్లో తేలి పోతుందన్నారు. ఓటమి భయంతోనే వాళ్లిద్దరూ దేశాల పాస్‌పోర్టులు సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ దగ్గర ఎలాంటి అధికారం లేదన్నారు. అయినప్పటికీ కసిరెడ్డి, మైనంపల్లి, రేఖా నాయక్ లాంటివారంతా తమ దగ్గరకు వచ్చారని పేర్కొన్నారు. బీఆరెస్ ప్రాధాన్యత అంతా ఎన్నికలు, ఓట్లు సీట్లు మాత్రమేనన్నారు.
బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో ఉందని, బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయనేది ప్రజలకు తెలుసన్నారు. అసలు కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చి వుండేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పై హరీశ్ రావు అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ మండిపడ్డారు. మొదట హరీశ్‌రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఖాయమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించబోతోందని స్పష్టం చేశారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను కర్ణాటక తరహాలో అమలు చేస్తామన్నారు. దీనిపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….
ఉద్యమం సమయంలో కల్వకుంట్ల కుటుంబం డబ్బులు పోగేసుకుందని ఆరోపించారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలను ఆ కుటుంబం దోచుకుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ పేరిట సుమారు పది వేల ఎకరాలను కబ్జా చేశారని ఆరోపణలు గుప్పించారు. రబ్బరు చెప్పులు వేసుకున్న హరీశ్‌రావుకు ఇప్పుడు ఇంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు.