తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సానుభూతి కోసం కల్వకుంట్ల కవితను జైల్లో పెట్టాలని కేసీఆర్-మోడీ ప్లాన్ చేశారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఎంఐఎంలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఇక తెలంగాణ విషయంలో పార్టీకి నష్టం జరిగినా ఇచ్చిన మాటను సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని తెలిపారు.
ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కల్వకుంట్ల కవిత విషయాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసేందుకు మోడీతో కేసీఆర్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. సానుభూతి పొందేందుకు కవితను రెండు నెలల పాటు తీహార్ జైలుకు పంపాలని యోచిస్తున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సోనియాగాంధీ ఆలోచన అనీ, మొదటి నుంచి ఈ విషయాన్ని కాంగ్రెస్ లేవనెత్తుతున్నదని తెలిపారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారని అన్నారు. యూపీఏ ఛైర్ పర్సన్ గా సోనియాగాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే, కవిత ఎంపీగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఏనాడూ మాట్లాడలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నదనీ, రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో జరిగిన అవినీతిపై కేంద్ర సంస్థలు ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించారు. కవిత విషయంలో ఎందుకు ముందుకు సాగడంలేదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేసీఆర్ కు మద్దతుదారుగా ఉన్నారనీ, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలకు కేసీఆర్ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించదని అన్నారు.