రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఈ సందర్భంగా కేసీఆర్ (KCR) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మీర్ పేట, సింగరేణి సామూహిక అత్యాచారాల ఘటనలు కలిచి వేస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. పోలీస్ వ్యవస్థను రాజకీయాలకి వాడుకోవడం వల్లే ఈ ఘోరాలు జరుగుతున్నాయని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ట్వీట్
‘‘విశ్వనగరం చేశానని కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్.. బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారింది. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్ పేటలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు కలచివేస్తున్నాయి. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారు. ఇలాంటి పాలనపై “తిరగబడదాం – తరిమికొడదాం” అని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.
మరోవైపు, కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుందని మరోసారి ఆరోపించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ చుట్టూ పదివేల ఎకరాల భూములు ఆక్రమించడమే కాకుండా.. ప్రశ్నించిన వారిపైకి పోలీసులను పంపుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు అని.. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ సీఎం అయిన తర్వాత 88 వేల మంది రైతులు చనిపోయారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. పావలా వడ్డీ, బంగారు తల్లి పథకాలను అటకెక్కించారని, ఇందిరమ్మ రాజ్యం తెచ్చి రూ.4వేలు పెన్షన్ ఇచ్చి తీరుతామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని.. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి.