కాంగ్రెస్ (Congress) పాలనతో ఇందిరమ్మ రాజ్యం మళ్లీ వచ్చిందన్నారు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy). సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) గడీల పాలన బద్దలు కొట్టామని తెలిపారు. తెలంగాణ (Telangana) కు పట్టిన చీడ పోయిందని వ్యాఖ్యానించారు. తాము పాలకులం కాదు.. ప్రజా సేవకులమని అన్నారు. ముందుగా జై తెలంగాణ.. జై సోనియమ్మ అనే నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రం అంత ఆషామాషీగా ఏర్పడింది కాదన్నారు రేవంత్. రాష్ట్రం అనేక పోరాటాలతో, అమరవీరుల త్యాగాల పునాది మీద, ఎన్నో ఆకాంక్షలు, ఆశలతో ఏర్పడిందని ప్రజలకు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో మీ ఆలోచనలను పంచుకోవచ్చని చెప్పారు. తెలంగాణను సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేళ్ళ పాటు దొరల పాలన కొనసాగిందని అన్నారు.
ఇకపై ప్రజల తెలంగాణగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు రేవంత్. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు అని.. ప్రగతి భవన్ ను జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్ గా మార్చినట్టు చెప్పారు. ప్రజలు ప్రజా భవన్ కు రావొచ్చని.. దాని చుట్టూ ఉన్న కంచెను బద్దలుకొట్టామని స్పష్టం చేశారు. అలాగే, శుక్రవారం నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు వివరించారు.
ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మొదలు రేవంత్ రెడ్డి వరకు అందరూ ప్రజా తెలంగాణ, ప్రజా ప్రభుత్వం, ప్రజల పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. దొరల తెలంగాణ స్థానంలో ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుందని ప్రజలకు స్పష్టంగా తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఆశించినట్లుగానే ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టారు. 4 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు ఫైల్ పై తొలి సంతకం చేశారు. రెండో సంతకం రజినీ అనే దివ్యాంగురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్న ఫైల్ పై సంతకం చేశారు.