Telugu News » Revanth Reddy : రేవంత్ ప్రమాణ స్వీకారానికి వాళ్లిద్దరూ వస్తారా?

Revanth Reddy : రేవంత్ ప్రమాణ స్వీకారానికి వాళ్లిద్దరూ వస్తారా?

ఇన్విటేషన్ అందుకున్న వారిలో ఎవరు వచ్చినా రాకపోయినా ఫర్లేదు కానీ.. ఆ ఇద్దరు నేతలు వస్తారా? లేదా? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. వారెవరో కాదు.. చంద్రబాబు, కేసీఆర్.

by admin

– రేపు మ.1.04 గంటలకు సీఎంగా రేవంత్ ప్రమాణం
– ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు
– పలు పార్టీల నేతలకు అందిన ఆహ్వానాలు
– చంద్రబాబు, కేసీఆర్ రాకపై సస్పెన్స్

ఇంకొన్ని గంటల్లో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకారోత్సవం కోసం తొలుత రాజ్‌ భవన్‌ (Raj Bhavan) లో అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ.. చివరకు ఎల్బీ స్టేడియానికి మార్చారు. అధికారులతో సీఎస్ (CS) శాంతికుమారి సమావేశం నిర్వహించి సమీక్షించారు. అందరూ సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. బుధవారం ఉదయం ఆమె స్వయంగా ఎల్బీ స్టేడియానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు.

revanth-reddy-invitation-to-kcr-and-chandrababu

గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఢిల్లీలో పార్టీ పెద్దలను స్వయంగా కలిసి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలకగా.. మిగిలిన నేతలకు ఇన్విటేషన్లు పంపించారు. వారిలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) కూడా ఉన్నారు. ఆయనతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ సహా ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఆహ్వానాలు పంపారు.

ఇన్విటేషన్ అందుకున్న వారిలో ఎవరు వచ్చినా రాకపోయినా ఫర్లేదు కానీ.. ఆ ఇద్దరు నేతలు వస్తారా? లేదా? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. వారెవరో కాదు.. చంద్రబాబు, కేసీఆర్. తెలంగాణలో అధికారం కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న కేసీఆర్.. రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేది కష్టమేననే వార్తలు వస్తున్నాయి. పైగా, ఎన్నికల ప్రచారంలో రేవంత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తారనే చర్చ జరుగుతోంది. కచ్చితంగా కేసీఆర్ రారనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది.

ఇంకోవైపు, చంద్రబాబు వస్తారా? లేదా? అనేది కూడా హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ లో చేరకముందే రేవంత్ రెడ్డి.. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు దగ్గరి మనిషిగా గుర్తింపు పొందారు. టీడీపీ ఎదుగుదలకు ఎంతో దోహదపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం తర్వాత తెలంగాణలో టీడీపీ గ్రాఫ్ పడిపోవడంతో చేసేదేం లేక కాంగ్రెస్ లో చేరారు రేవంత్. ఇప్పటికీ చంద్రబాబు, రేవంత్ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. మరి.. శిష్యుడి ప్రమాణ స్వీకారానికి ఆయన వస్తారా? లేక, దూరంగా ఉంటారా? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.

You may also like

Leave a Comment