కాంగ్రెస్ ( Congress) అభ్యర్థుల ఎంపికపై పలు మీడియాలో వస్తున్న వార్తలపై టీపీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థుల జాబితా విషయంలో మీడియా ఇష్టారీతిన వార్తలు రాసి తమను గందరగోళానికి గురి చేయవద్దని సూచించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ కు ఓ ప్రత్యేకమైన విధానం ఉందని తెలిపారు. ఆ విధానాన్ని అనుసరించే అభ్యర్థులను తమ పార్టీ ఎంపిక చేస్తుందన్నారు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో చిన్న పాటి భేదాభిప్రాయాలు ఉండటం సహజమేనని తెలిపారు. అంత మాత్రాన తాము గొడవలు పడుతున్నట్టు వార్తలు రాయడం సరికాదన్నారు. పలు రకాల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తామన్నారు.
పొత్తుల అంశంపై చర్చలు నడుస్తున్నాయని చెప్పారు. కానీ ఇప్పటికే పొత్తు కుదిరినట్టు కొందరు అసత్య కథనాలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుతానికి తాము ఎమ్మెల్యే టికెట్ల విషయంపై మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నామని వివరించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక, తామే ఆ జాబితాను అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
టికెట్ రాని వారికి ఎంపీ, ఎమ్మెల్సీ,తో పాటు ఇతర పదవులు ఇలా చాలా రకాల అవకాశాలు ఉన్నాయన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని తప్పకుండా గుర్తించి గౌరవిస్తామన్నారు. ఎన్నికల్లో అధికారుల పాత్ర చాలా కీలకమని అన్నారు. కానీ గత కొన్నేండ్లుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు బీఆర్ఎస్ పార్టీ కోసం ఆ పార్టీ నేతల కన్నా ఎక్కువగా పని చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వారి వివరాలు సేకరించి కేంద్ర, రాష్ట్రం ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తామన్నారు.