నాంపల్లి (Nampally) అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ (Revanth) మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణగానే వరుస ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నగరం అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణా చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
నాంపల్లి ఘటనలో 9 మంది చనిపోవడం అత్యంత బాధాకరమన్న ఆయన.. అపార్ట్మెంట్ సెల్లార్ లో కారు మరమ్మతులు ఏంటి? అని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపిన రేవంత్.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరోవైపు, అగ్నిప్రమాద అపార్ట్ మెంట్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ వచ్చారు. అదే సమయంలో స్థానిక ఎంఐఎం కార్యకర్తలు అక్కడ ఉండగా.. ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రభుత్వ నిర్లక్షం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు.
సోమవారం ఉదయం నాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగి ఐదు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. అలాగే, అమీర్ పేట, పాతబస్తీల్లో కూడా ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదాలు సంభవించాయి. మధురానగర్ లో ఓ ఫర్నీచర్ గోదాంలో ప్రమాదం చోటుచేసుకుంది. అలాగే, షాలిబండ ఏరియాలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేశారు.